గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్!

  • శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టిన ఆలయ కమిటీ సభ్యులు
  • ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
  • తాకట్టు డబ్బులు ఇస్తేనే ఊరికి వస్తానన్న బంగారు కొట్టు వ్యాపారి

కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయమైన (తాకట్టు) వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమ తాకట్టు ఉదంతంపై దేవదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణ చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని, అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయం తాళాలు తెరిపించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా అందుబాటులోకి రాకపోవడం, ఫోన్లలో దాటవేత సమాధానాలు చెప్పడంపై లలిత తీవ్ర విస్మయంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ దర్యాప్తులో భాగంగా కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన దాత కుటుంబ సభ్యులను లలిత స్వయంగా కలిసి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఆలయ కమిటీ దేవదాయ శాఖ అధికారిక పరిధిలో లేకపోవడం వల్ల నేరుగా తక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నామని, రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి అడుగు వేస్తామని ఆమె స్పష్టం చేశారు. మధ్యాహ్నంలోపు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉండటంతో లలిత ఆలయంలోనే ఉండి విచారణను ముమ్మరం చేశారు. మరోవైపు, దేవుడి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న సదరు బంగారు కొట్టు వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, తన ఖాతాకు తాకట్టు పెట్టిన డబ్బులు తిరిగి జమ చేస్తేనే ఊరికి వస్తానని అతను ట్రస్ట్ బోర్డుకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. 


ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆలయానికి చేరుకుని ట్రస్ట్ బోర్డు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దారుణమైన ఘటన వల్ల గుడివాడ పట్టణానికే చెడ్డపేరు వస్తోందని ఆయన మండిపడ్డారు. స్వామివారి సొత్తుతో వ్యాపారం చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదని, సాయంత్రంలోగా బంగారు కిరీటాన్ని తెచ్చి స్వామివారికి అలంకరించకపోతే భక్తులతో కలిసి పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్‌కు దిగుతామని హెచ్చరించారు. అపచారానికి పాల్పడిన కమిటీ సభ్యులతో పాటు, దాన్ని అక్రమంగా తాకట్టు పెట్టుకున్న వ్యాపారిపై కూడా కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఈ న్యాయపోరాటాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని యలవర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


Gudivada Temple
Krishna District
Gold Crown Missing
Endowments Department
Trust Board
Yalavarthi Srinivas Rao
Temple Theft
Andhra Pradesh Temples
Kalyana Venkateswara Swamy Temple
Temple Mismanagement

More Telugu News